బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గాల మధ్య పోరు ముదిరింది. సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్‌ను సీఎం చేయాలని, తమకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని డీకే మద్దతుదారుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ బాహాటంగా ప్రకటించారు. డీకేకి ఒకసారి అవకాశం ఇవ్వాలని, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారని చెప్పారు. ఇప్పుడు మార్పు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు సాధ్యం కాదని హెచ్చరించారు.
కాగా, తనకు మద్దతు పలుకుతూ ఎమ్మెల్యేలు కొందరు బహిరంగ ప్రకటనలు చేయడంపై డీకే అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా ఎవరూ మాట్లాడవద్దని హెచ్చరించారు. మరోవైపు, రెండు రోజులుగా పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరిస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూర్జేవాలా రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదని స్పష్టం చేశారు.
సీఎం మార్పుపై ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వీడియో ఒకటి సంచలనం సృష్టించింది. సిద్ధరామయ్య లాటరీ కొట్టారు. ఆయనను సోనియా గాంధీకి పరిచయం చేసింది నేనే. ఆయన అదృష్టం బాగుండి సీఎం అయ్యారు. నాకు గాడ్‌ఫాదర్ కాని గాడ్ కాని ఎవరూ లేరు. సూర్జేవాలాను కలిసి నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఓపికగా నా మాటలు విన్నారు. చూద్దాం..ఏం జరుగుతుందో అంటూ ఆ వీడియోలో పాటిల్ అన్నారు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య.. ‘అవును నేను అదృష్టవంతుడినే’ అని పేర్కొన్నారు.