న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవిపై సరేశ్ గోపీ అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తలను కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్(Surendran) ఖండించారు. కేరళ మీడియాను ఆయన తప్పుపట్టారు. కొందరు జర్నలిస్టులు కేరళ బీజేపీ యూనిట్‌పై దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. త్రిసూర్ లోక్‌సభ స్థానం నుంచి సురేశ్ గోపిని ఓడించాలని కేరళ బీజేపీ యూనిట్ ప్లాన్ చేసినట్లు మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసినట్లు కూడా సురేంద్రన్ ఆరోపించారు. ఆదివారం రోజున కేంద్ర సహాయ మంత్రిగా సురేశ్ గోపి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సురేశ్ గోపిపై జరిగిన ఫేక్ న్యూస్ ప్రచారాన్ని ఓటర్లు తిప్పికొట్టినట్లు సురేంద్రన్ వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తనపై కూడా ప్రచారం జరిగిందని, మీడియాకే తన బాధ్యతలను అప్పగించనున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేరళ నుంచి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయని, తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో 20 శాతం బీజేపీ ఓటు షేర్ పెరిగిందని సురేంద్రన్ చెప్పారు. సురేశ్ గోపితో పాటు జార్జ్ కురియన్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంలో మార్పులు ఏమీ ఉండవన్నారు.