లక్నో, జూన్ 16: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎంతో పొత్తు అవకాశాలను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తోసిపుచ్చారు. ‘ఇండియా కూటమి’లో ఏఐఎంఐఎంకు చోటు దక్కే అవకాశమే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి చెక్కు చెదరకుండా ఉంటుందని, 2027 ఎన్నికలకు సమాజ్వాదీ, రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే యూపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నది. ఆయా రాజకీయ పార్టీలు వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల పోరు కోసం తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఏఐఎంఐఎం బీహార్ ఎన్నికల్లో తన ఉనికిని చాటగా, యూపీలోనూ విస్తరించడానికి ప్రయత్నిస్తున్నది.