Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో వింత చోటు చేసుకుంది. నిర్మాణమే జరగని ప్రభుత్వ ఆస్పత్రికి ఏకంగా 87 మంది వైద్య సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. అసలు హాస్పిటలే లేదంటే.. అక్కడినుంచి ట్రాన్స్ఫర్లు, అపాయింట్మెంట్లు జరగడం విశేషం. ఈ వింత ఇండోర్‌లో జరిగింది. 2020, జూన్ 23న ఇండోర్‌లో 100 పడకలతో ఖజ్రానా అనే ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆస్పత్రి ప్రాజెక్టులో భాగంగా ఇక్కడికి వైద్యులు, టెక్నికల్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్ కలిపి 87 మంది సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది.
ఇప్పటికి ఆరేళ్లైనా ఆస్పత్రి నిర్మాణం కాదుకదా.. కనీసం భూ కేటాయింపు కూడా జరగలేదు. కానీ, ఈ ఆరేళ్ల కాలంలో ఈ ఆస్పత్రికి ప్రభుత్వం చాలా మంది సిబ్బందిని నియమించింది. వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఇలా చాలామందిని ప్రభుత్వం ఇక్కడికి కేటాయిస్తూ వచ్చింది. పైగా గత నెల 15న ఈ ఖజ్రానా ఆస్పత్రికి ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను కూడా ప్రభుత్వం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసింది. ఇక, ఇక్కడినుంచి కొందరు మరో చోటుకు కూడా ట్రాన్స్ఫరై వెళ్లారు. ఈ అంశం ఇటీవల బయటపడటంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ హాస్పిటలే లేకుండా స్టాఫ్‌ను ప్రభుత్వం ఇక్కడికి ఎలా పంపిస్తుంది.. ఇక్కడి నుంచి సిబ్బందిని మరో చోటుకు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు.. ఇక్కడికొచ్చిన స్టాఫ్ అంతా ఎక్కడ, ఏ పని చేస్తున్నట్లు.. ఇలా అనేక సందేహాలు మొదలయ్యాయి. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడింది. ఇదో పెద్ద స్కాం అంటూ విమర్శించింది.
పేపర్ల మీదే ఉన్న ఆస్పత్రికి స్టాఫ్‌ను ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యంగా పంపిస్తుంది అంటూ ప్రశ్నిస్తోంది. అయితే, ఈ అంశంపై చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా.మాధవ్ హసాని స్పందించారు. ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని, ఇక్కడికి కేటాయించిన స్టాఫ్‌ను దగ్గర్లోని సంజీవని క్లినిక్స్, ఇతర ప్రభుత్వ ఆస్పత్రులలో వినియోగిస్తున్నామని చెప్పారు. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం కూడా స్పందించారు. భూమి లేకపోవడం వల్లే ఆస్పత్రి నిర్మాణం జరగలేదన్నారు. సంబంధిత సిబ్బందిని ఇతర ఆస్పత్రులలో వినియోగిస్తున్నామన్నారు.