న్యూఢిల్లీ, జనవరి 5: వైద్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు క్లినికల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తొలిసారి తన నియంత్రణలో ఉన్న మెడికల్ కాలేజీల్లో పోస్ట్-డాక్టొరల్ ఫెలోషిప్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు వైద్య విద్యా సంస్థలే సొంతగా ఇలాంటి కోర్సులను రూపొందించి, ఆమోదించేవి. ఈ నేపథ్యంలో ఎన్ఎంసీ ఇటీవల ‘పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-2023’ను నోటిఫై చేసింది.
ఈ నిబంధనల ప్రకారం ఏదైనా మెడికల్ కాలేజీలో పీజీ కోర్సును లేదా సీట్లను ప్రారంభించేందుకు అనుమతించిన తర్వాత ఆ కోర్సు గుర్తింపు పొందినట్టుగా పరిగణిస్తారు. దీంతో పోస్టుగ్రాడ్యుయేట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తర్వాత డిగ్రీని రిజిస్టర్ చేసుకోవడంలో విద్యార్థులకు ఎదురవుతున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎన్ఎంసీ ఆధ్వర్యంలోని పోస్టు-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్ ఓజా వివరించారు. పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ (సవరణ) నిబంధనలు-2018 స్థానంలో నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. పీజీ అడ్మిషన్ల కోసం ప్రతిపాదించిన నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్) అమలులోకి వచ్చే వరకు ప్రస్తుత నీట్-పీజీ పరీక్ష కొనసాగుతుంది.