Nitish Kumar : జేడీయూ అధ్యక్షుడు (JDU chief) నితీశ్ కుమార్ (Nitish Kumar) పదోసారి బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నితీశ్‌కుమార్‌ను ఇవాళ జరిగిన ఎన్డీయే (NDA) శాసనసభాపక్ష సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలంతా కలిసి తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
దాంతో బీహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికైన నితీశ్‌కుమార్ మరికొద్దిసేపట్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని లేఖ ఇవ్వనున్నట్లు సమాచారం. గవర్నర్ ఆహ్వానం మేరకు నితీశ్ రేపు పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆయనతోపాటు పలువురు మంత్రులుగా కూడా ప్రమాణం చేయనున్నారు.
కూటమి సర్కారులో జేడీయూ, బీజేపీతోపాటు నలుగురైదుగురు ఎల్జేపీ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. కాగా ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ ప్రధాన పార్టీలుగా గల ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలకుగాను ఏకంగా 202 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ 41 స్థానాలకు పరిమితమైంది. అందులో ఆర్జేడీకి 25, కాంగ్రెస్‌కు 5 స్థానాలు మాత్రమే దక్కాయి.