నాగ్పూర్, జూలై 14 : పరిపాలనా యంత్రాంగంలో క్రమశిక్షణ తీసుకువచ్చేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయవలసిన అవసరం చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. సోమవారం నాడిక్కడ ప్రకాశ్ దేశ్పాండే స్మృతి కౌశల్ సంఘటక్ పురస్కార ఉత్సవంలో కేంద్ర రవాణా, హైవేల శాఖ మంత్రి గడ్కరీ ప్రసంగిస్తూ కొన్నిసార్లు ప్రభుత్వం కూడా సాధించలేనిది కోర్టు ఉత్తర్వులు సాధించగలవని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలలో పిటిషన్లు వేసే వ్యక్తులు సమాజానికి అవసరమని ఆయన చెప్పారు.
ఇది రాజకీయ నాయకులను సరైన దారిలో పెడుతుందని, కోర్టు ఉత్తర్వు పనిచేసినట్లు ప్రభుత్వంలో మంత్రులు కూడా పనిచేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. కౌశల్ సంఘటక్ పురస్కార గ్రహీతలు అవసరమైనపుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలలో అనేక పిటిషన్లు వేశారని ఆయన చెప్పారు. ముఖ్యంగా విద్యారంగంలో వారు వేసిన కేసులతో ప్రభుత్వం తన నిర్ణయాలను మార్చుకోవడం లేదా రద్దు చేసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు.