తిరువనంతపురం: మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను నిట్ ప్రొఫెసర్ ప్రశంసించింది. దీనిపై కేసు నమోదుకావడంతో అరెస్టైన ఆమె బెయిల్‌పై విడుదలైంది. అయితే ఆ మహిళా ప్రొఫెసర్‌ను (NIT-Calicut Professor) ప్రస్తుతం డీన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో నిట్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలికట్లో ప్రొఫెసర్ అయిన డాక్టర్ షైజా 2024లో గాంధీ వర్ధంతి రోజున ఒక న్యాయవాది షేర్ చేసిన పోస్ట్‌పై ప్రతిస్పందించారు. నాథూరామ్ గాడ్సేను ఆమె ప్రశంసించారు. గాంధీని హత్య చేసి భారతదేశాన్ని కాపాడినందుకు గాడ్సే పట్ల గర్వపడుతున్నట్లు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా, విద్యార్థి సంఘాలైన డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, యూత్ కాంగ్రెస్, ప్రొఫెసర్ షైజాపై నాడు మండిపడ్డాయి. వారి ఫిర్యాదులతో గత ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ చేసి ప్రశ్నించారు. అయితే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఆ కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నది.
మరోవైపు ప్రొఫెసర్ షైజాను తాజాగా ప్లానింగ్, అభివృద్ధి విభాగం డీన్‌గా నియమించారు. మార్చి 7 నుంచి ఇది అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రస్తుత డీన్ డాక్టర్ ప్రియా చంద్రన్‌తో కలిసి పనిచేయాలని షైజాకు సూచించారు. నిట్ కాలికట్ డైరెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, వివాదస్పద ప్రొఫెసర్ షైజాను డీన్‌గా నియమించడాన్ని కేరళలోని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నిట్ నిర్ణయంపై మండిపడ్డాయి. అధికార సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ దీనిపై నిరసనకు పిలుపునిచ్చింది.