లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పాలక బీజేపీతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉంటుందని నిషాద్ పార్టీ మంగళవారం స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో తాము 70 స్ధానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్నామని, అయితే ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఫార్ములా ఇంకా ఖరారు కాలేదని నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ పేర్కొన్నారు.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో తాము బీజేపీతో కలిసి పోటీ చేస్తామని, ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మరోవైపు యూపీలో అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా కాషాయ పార్టీని మట్టికరిపించి పాలనా పగ్గాలు చేపట్టాలని సమాజ్‌వాదీ పార్టీ సన్నద్ధమవుతోంది. యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఎస్పీ, కాంగ్రెస్‌లు కూడా కసరత్తు సాగిస్తున్నాయి.