Nirmala Sitharaman | కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ హయాంలో వెలుగుచూసిన మొండి బకాయిల సంక్షోభం కోట్లాది చిరువ్యాపారులు, స్టార్టప్‌లు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికుల కలలను, రుణ అవసరాలను చిదిమివేసిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎక్స్ వేదికగా ఆమె వరుస ట్వీట్లలో యూపీఏ నిర్వాకాన్ని ఎండగట్టారు.
యూపీఏ ప్రభుత్వం రాజ వంశీయులకు, కుబేరులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కోట్లాది మంది ప్రయోజనాలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటుగానే ఈ కుబేరులంతా విచారణకు భయపడి పారిపోయారని అన్నారు. బ్యాంకుల జాతీయీకరణ ఘనతను సొంతం చేసుకున్న వారు దశాబ్ధాల తరబడి పేదలు, మధ్యతరగతికి బ్యాంకులను దూరం చేశాయని కాంగ్రెస్ అగ్ర నేతలను ఉద్దేశించి ఆమె ఆరోపణలు గుప్పించారు.
వారి నేతలు, భాగస్వామ్య పార్టీలు మాత్రం అవినీతి నిచ్చెనల ఆధారంగా అందలమెక్కాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బ్యాంకింగ్ రంగం మేలి మలుపు తీసుకుందని అన్నారు. తమ ప్రభుత్వం సమగ్ర, దీర్ఘకాలిక సంస్కరణలను తీసుకొచ్చిందని వివరించారు. రుణ వితరణలో క్రమశిక్షణ, ఒత్తిడిని గుర్తించి పరిష్కరించడం, బాధ్యతాయుత రుణ వితరణ, సుపరిపాలన వంటి సంస్కరణలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.
Read More :
Bruhat Soma: స్పెల్లింగ్ బీ పోటీ నెగ్గిన 12 ఏళ్ల భారత సంతతి విద్యార్థి