వాషింగ్టన్: అమెరికాలో జరిగే జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో మళ్లీ భారతీయ సంతతి విద్యార్థి సత్తా చాటారు. ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల బృహత్ సోమా(Bruhat Soma) అనే కుర్రాడు.. ఈ ఏడాది స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ కాంటెస్ట్‌లో విజయం సాధించాడు. టైబ్రేకర్ రౌండ్లో అతను 29 పదాలు ఉన్న పదాన్ని పలికాడు. ప్రతిష్టాత్మకమైన స్పెల్లింగ్ బీ పోటీల్లో కొన్నాళ్లుగా భారతీయ సంతతి విద్యార్థులదే హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ గెలుపుతో బృహత్ సోమాకు 50 వేల డాలర్ల నగదు ప్రైజ్‌మనీ అందజేశారు. ఈ ఏడాది పోటీ టైబ్రేకర్ వరకు వెళ్లింది. బృహత్ 29 పదాలను కేవలం 90 సెకన్లలో పలికేశాడు. ఫైనల్లో అతను ఫైజాన్ జాకిని ఓడించాడు. ఆ కుర్రాడు లైటనింగ్ రౌండ్లో కేవలం 20 పదాలు మాత్రమే పలికాడు. abseil అనే పదం అతనికి చాంపియన్‌షిప్ ట్రోఫీని అందజేసింది.