Nirmala Sitharaman : దేశవ్యాప్తంగా మొత్తం 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీ (GST) పై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి (Finance minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ (GST council) నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం సిటీలోగల మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
అనేక రంగాల్లో ఇప్పటికే జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయని, పన్ను శ్లాబ్‌లను నాలుగు నుంచి రెండుకు తగ్గించామని చెప్పారు. 12 శాతం పన్ను పరిధిలో ఉండే వస్తువుల్లో దాదాపు 99 శాతం వస్తువులను 5 శాతం పన్ను శ్లాబ్ పరిధిలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉండే సిమెంట్ సహా 90 శాతం వస్తువులను 18 శాతం పన్ను శ్లాబ్ పరిధిలోకి తెచ్చినట్లు చెప్పారు. 2017కు ముందు మొత్తం 17 రకాల పన్నులు ఉండేవని, వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవని ఆర్థిక మంత్రి గుర్తుచేశారు.
ఉదాహరణకు 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేదని, అన్నింటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను, నాలుగు శ్లాబ్‌ల రూపంలో జీఎస్టీని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది రూ.22.08 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ తీసుకొచ్చామని తెలిపారు. పాలు, పెరుగు సహా పలు నిత్యావసరాలను 5 శాతం పన్ను శ్లాబ్ నుంచి సున్నా శాతానికి తీసుకొచ్చామని చెప్పారు.
మధ్యతరగతికి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కారు, ఫ్రిజ్, ఏసీని 28 శాతం నుంచి 18 శాతానికి తీసుకొచ్చామని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌కు జీఎస్టీ నూతన సంస్కరణలు పెద్ద ఊతమని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం కోసం శానిటరీ న్యాప్కిన్స్పై పన్నును సున్నా చేశామని చెప్పారు. యూపీఏ హయాంలో 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వస్తువులను ఇప్పుడు 5 శాతానికి తెచ్చామని తెలిపారు. సరళతరమైన పన్ను విధానాన్ని తీసుకురాలేని వాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.