Nirav Modi | పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్‌లో పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మరోసారి లండన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నవంబర్ 23న విచారణకు వచ్చే అవకాశం ఉంది. భారత్‌కు అప్పగింత కేసును తిరిగి విచారించాలని కోర్టును అభ్యర్థించారు. నీరవ్ మోదీ ఇప్పటికే సుప్రీంకోర్టుతో సహా తన అన్ని చట్టపరమైన అప్పీల్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తను కేసును మరోసారి విచారించాలని వెస్ట్‌మినిస్టర్ కోర్టును ఆశ్రయించారు. తనను భారత్‌కు అప్పగిస్తే పలు ఏజెన్సీలు తనను విచారించడంతోపాటు హింసించే అవకాశం ఉందని నీరవ్ మోదీ పిటిషన్లో ఆరోపించారు. అయితే, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలు నీరవ్ మోదీని రప్పిస్తే భారత చట్టాల ప్రకారం విచారిస్తామని.. ఏజెన్సీలు ఆయనను విచారించబోవని కోర్టుకు మరోసారి హామీ ఇవ్వచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేశామని.. తాజాగా మరోసారి ఆయనను విచారించాల్సిన అవసరం లేదని.. తమ దర్యాప్తు దాదాపు పూర్తయ్యిందని కోర్టుకు చెప్పే అవకాశం ఉంది.
యూకే కోర్టు అడిగితే నీరవ్‌ను భారత్‌కు అప్పగిస్తే విచారించబోమని హామీ ఇస్తున్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. వందలాది మోసపూరిత లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.6,498 కోట్లకుపైగా మోసం చేశాడని మోదీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సంస్థలు నీరవ్‌ను విచారించాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నాయి. భారత్‌ను తీసుకువస్తే ముంబయిలని ఆర్థర్ రోడ్ జైలులోని బ్యారక్ 12లో మోదీని ఉంచనున్నట్లుగా భారత్ ఇప్పటికే బ్రిటన్‌కు తెలిపింది. హింస, ఏ ప్రమాదం జరిగే అవకాశం లేదని.. ఈ జైలులో వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. భారత చట్టాల ప్రకారం.. అతన్ని కేవలం విచారిస్తామని.. కొత్త అభియోగాలు నమోదు చేయబోమని ఏజెన్సీలు బ్రిటన్‌కు హామీ ఇచ్చాయి. ఈ 54 ఏళ్ల వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని మార్చి 19, 2019న అప్పగింత వారెంట్‌పై అరెస్టు చేశారు. అప్పటి బ్రిటిష్ హోం కార్యదర్శి ప్రీతి పటేల్ 2021 ఏప్రిల్‌లో నీరవ్ మోదీని అప్పగించాలని ఆదేశించారు. దాదాపు ఆరు సంవత్సరాలుగా లండన్ జైలులోనే ఉంటున్నాడు.