నలంద: బీహార్‌లోని నలంద జిల్లాలో గల శీతల మాత ఆలయంలో మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం చెందారు. చైత్ర మాసం చివరి మంగళవారాన వచ్చిన శీతలాష్టమి సందర్భంగా దేవతకు నైవేద్యాలు సమర్పించే ఆచారాన్ని పాటించడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.
క్యూలోని కొందరు భక్తులు లైన్ దాటి దర్శనానికి పరుగులు పెట్టడం తొక్కిసలాటకు దారి తీసింది. సుమారు 10 వేల మంది భక్తులు గుమికూడిన చోట ఈ దుర్ఘటన జరిగింది. ఆలయం వద్ద ఒక పోలీస్‌ను కూడా భద్రత కోసం నియమించలేదని భక్తులు ఆరోపించారు. మరోవైపు నలందలో రాష్ట్రపతి పర్యటనకు 2,500 మంది పోలీసులతో భద్రత కల్పించడం గమనార్హం.