Nighties-Lungis Ban | ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఓ హౌసింగ్ సోసైటీ విచిత్ర నిర్ణయం తీసుకున్నది. సొసైటీ పరిసరాల్లో టీమహిళలు నైటీలు, పురుషులు లుంగీలు ధరించకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా అక్కడ తిరిగేందుకు ప్రత్యేకంగా డ్రెస్‌కోడ్‌ను సైతం తీసుకువచ్చారు. నోయిడా సెక్టార్ ఫై-2లో హింసాగర్ సొసైటీకి చెందిన రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. అయితే, మహిళలు నైటీలు ధరించి బయట తిరుగుతుంటే పురుషులకు అసౌకర్యంగా ఉంటుందని, అలాగే పురుషులు లుంగీలు వేసుకొని బయటకు వస్తే మహిళలు అసౌకర్యానికి గురవుతారని, కాబట్టి మనం ఒకరినొకరు గౌరవించుకోవాలని, ఈ మేరకు ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని హింసాగర్ సొసైటీ సొసైటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీకే కల్రా పేర్కొన్నారు.
ఇది సమాజహితం కోసం తీసుకున్న ఓ మంచి నిర్ణయమన్న ఆయన.. దీన్ని అందరూ గౌరవించాలన్న ఆయన.. ఈ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదనన్నారు. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో తిరిగే సమయంలో దుస్తులు, ప్రవర్తనపై ప్రత్యేక శద్ధ పెడతారని ఆశిస్తున్నామని, తద్వారా మీ ప్రవర్తనను ఎవరూ తప్పుపట్టే అవకాశం ఉండదని సర్క్యూలర్‌లో సొసైటీ పేర్కొంది. అయితే, ఈ నెల 10న సభ్యులు సొసైటీ ఈ నోటీసులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో, పార్కింగ్ స్థలాల్లో లుంగీలు, నైటీలు ధరించి తిరగరాదని సూచించారు.
ఇంట్లో ఉన్నప్పుడు వేసుకునే దుస్తులు మాత్రమేనని సొసైటీ నోటీసులో స్పష్టం చేసింది. అయితే, నోటీసును పలువురు సోషల్ మీడియాలో పెట్టడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సొసైటీ నిర్ణయాన్ని చాలా మంది నెటిజన్లు తప్పుపట్టారు. మరికొందరు సొసైటీ నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. ఇతరుల వస్త్రధారణపై ఆంక్షలు విధించే అధికారం లేదని, ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు దుస్తులు వేసుకుంటారని, తాము చెప్పిన బట్టలను మాత్రమే ధరించాలని చెప్పడం సరైంది కాదని ఓ నెటిజన్ పేర్కొన్నారు. లుంగీ అనేది దక్షిణ భారతంలో ఓ సంప్రదాయ వస్త్రధారణ అని, ఇలా చేయొద్దంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉండగా.. సభ్యులు మాత్రం సొసైటీ జారీ చేసిన ఆదేశాలతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పడం విశేషం.