కోల్‌కతా, మే 31: ఉగ్రవాదులతో లింక్‌లు ఉన్నాయన్న అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశంలోని ఏడు రాష్ర్టాల్లో 15 చోట్ల దాడులు నిర్వహించింది. ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం రాష్ర్టాల్లో ఈ దాడులు జరిపింది. పాకిస్థాన్ హ్యాండ్లర్లకు సున్నిత సమాచారం అందిస్తున్నారన్న ఆరోపణపై సీఆర్పీఎఫ్కు చెందిన ఒక వ్యక్తిని ఇటీవల అరెస్ట్ చేసింది.
ఈ క్రమంలో అనుమానిత నగదు లావాదేవీలు వెలుగులోకి రావడంతో కోల్‌కతాలో ఒక ట్రావెల్ కార్యాలయం సహా మూడు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు జరిపింది. కనీసం మూడు సార్లు ఈ ట్రావెల్ సంస్థ నుంచి అనుమానాస్పద నగదు బదిలీ లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో దాని యజమాని మహమ్మద్ మసూద్ అలమ్‌కు సమన్లు జారీ చేసి సోమవారం తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.
అలాగే పాకిస్థాన్ ఇంటెలిజెన్స్‌కు రహస్య సమాచారం అందించారన్న ఆరోపణతో ఢిల్లీకి చెందిన సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ మోతీరామ్ జత్ను అరెస్ట్ చేసిన క్రమంలో ఢిల్లీ, చండీగఢ్‌లలో ఎన్ఐఎ దాడులు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 15 ప్రదేశాల్లో దాడులు జరిగిన విషయాన్ని ఎన్ఐఏ అధికారులు శనివారం నిర్ధారించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అందజేస్తామని తెలిపారు.