న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక అడుగు పడింది. ఆ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కీలక నిందితుల పేర్లను తన ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, ద రెసిస్టెంన్స్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్(Hafiz Saeed) పేరును కూడా ఆ ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. జమ్మూలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో ఇవాళ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు, యూఏపీఏ చట్టం ప్రకారం హఫీజ్‌పై నేరాభియోగం నమోదు చేశారు. భారత్‌పై యుద్ధం చేపట్టేందుకు రెచ్చగొట్టినట్లు కూడా శిక్షా స్మృతి కింద కేసు బుక్ చేశారు. కుట్రకు పాల్పడినట్లు ఛార్జ్‌షీట్‌లో ఆరోపించారు. 1597 పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను గతంలో ఎన్ఐఏ తయారు చేసింది. అయితే పాకిస్థాన్‌కు చెందిన హఫీజ్ కుట్రపన్నినట్లు వివరాల్లో వెల్లడించారు. శాస్త్రీ యపద్ధతిలో దర్యాప్తు చేపట్టిన తర్వాత ఎన్ఐఏ ఈ కేసులో దానికి సంబందించిన ఆధారాలను సేకరించినట్లు తెలిసింది.
2025 డిసెంబర్ 15వ తేదీన నమోదు చేసిన ఛార్ఝ్ షీట్లో పాకిస్తాన్ ఉగ్రవాది సాజిద్ జాట్ పేరు కూడా ఉన్నది. ఇక 2025 జూలైలో జరిగిన ఆపరేన్ మహాదేవ్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పెహల్గామ్ ఉగ్రదాడి ప్లానింగ్, అమలు మొత్తం లష్కరే, టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ఆధ్వర్యంలో జరిగినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకశ్మీర్‌లోని పెహల్గామ్లో పాక్ ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. సుమారు 25 మంది టూరిస్టులు, ఓ స్థానిక వ్యక్తి ఆ కాల్పుల్లో మృతిచెందారు.
అనంత్‌నాగ్‌లో ఉన్న పెహల్గామ్ పోలీసు స్టేషన్లో తొలుత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక విచారణ తర్వాత ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాక్ కుట్రను తేల్చేందుకు ఎన్ఐఏ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది.