న్యూఢిల్లీ, డిసెంబర్ 15: జమ్ము కశ్మీరులోని పహల్గాంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న 26 మంది అమాయక పౌరులను బలిగొన్న ఉగ్రదాడి కేసులో ఏడుగురు నిందితులు, ఐదుగురు అనుమానితులు, పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తాయిబా(లెట్), ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోమవారం చార్జిషీట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో పేర్కొన్న ఏడుగురు అనుమానితుల్లో లష్కరే కమాండర్ కూడా ఉన్నాడు. ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ కుట్రను, నిందితుల పాత్రను, ఇందుకు బలం చేకూర్చే ఆధారాలు ఎన్ఐఏ తన చార్జిషీట్లో ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ కుట్రను అమలు చేయడంలో రెండు ఉగ్ర సంస్థల పాత్రను ఎన్ఐఏ విశదీకరించింది. పహల్గాం దాడి ప్రధాన సూత్రధారిగా లష్కరే టాప్ కమాండర్ సాజిద్ జట్ పేరును తన 1,597 పేజీల చార్జిషీట్లో ఎన్ఐఏ పేర్కొంది. జూలైలో శ్రీనగర్ సమీపంలో భద్రతా దళాల ఎదురుదాడిలో మరణించిన పాకిస్థానీ ఉగ్రవాదులను కూడా చార్జిషీట్లో ఎన్ఐఏ ప్రస్తావించింది.