CRPF Jawan Arrest | యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగు చూడడంతో కేంద్రం పూర్తిగా అప్రమత్తమైంది. భారత్‌లో ఉంటూ పాక్‌కు సున్నిత సమాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూఢచర్యానికి పాల్పడుతున్న పలువురిని అరెస్టు చేసింది. పలువురు అధికారులు డబ్బుకోసం పాకిస్తాన్‌కు రహస్యాలు పంపగా.. మరికొందరు హనీట్రాప్‌లో పడి సున్నిత సమాచారాన్ని పంపుతున్నట్లు తేలింది. తాజాగా గూఢచారుల జాబితాలో సీఆర్పీఎఫ్ జవాన్ సైతం ఉన్నట్లు తేలింది. ఈ వార్త ప్రస్తుతం కలకలం రేగింది. దేశ రక్షణ కోసం పనిచేసే సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరు డబ్బు కోసం దేశానికి చెందిన కీలకమైన రహస్యాలు శత్రుదేశానికి చేరవేసినట్లుగా గుర్తించారు.
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోమవారం సీఆర్పీఎఫ్ జవాన్‌ను అరెస్ట్ చేసింది. సదరు జవాన్‌ను మోతీరామ్ జాట్‌గా గుర్తించారు. అతను గూఢచర్య కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. 2023 సంవత్సరం నుంచి పాకిస్తాన్ నిఘా అధికారులకు సమాచారం అందిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. వివిధ మార్గాల ద్వారా డబ్బు అందుకుంటున్నట్లు ఏజెన్సీ గుర్తించింది. ఎన్ఐఏ బృందం మొదట ఢిల్లీలో మోతీ రామ్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసింది. ప్రస్తుతం మోతీరామ్ ఏం సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేశాడన్న కోణంలో అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. సీఆర్పీఎఫ్ జవాన్‌ను పాటియాలా హౌస్‌కోర్టులో హాజరుపరిచింది.
నిందితుడికి కోర్టు జూన్ 6 వరకు కస్టడీ విధించింది. ఈ కేసులో కేంద్ర పారామిలిటరీ దళం మోతీరామ్ జాట్‌ను సర్వీసుల నుంచి తొలగించింది. భారత రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలతో పాటు సీఆర్పీఎఫ్ నిబంధనల ప్రకారం నిందితుడిని మే 21న సర్వీసు నుంచి తొలగించారు. ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన తర్వాత సీఆర్పీఎఫ్ సిబ్బందిని సర్వీసు నుంచి తొలగించినట్లు తెలిపింది. సీఆర్పీఎఫ్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి.. దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ప్రస్తుతం మోతీరామ్‌కు ఎవరితో సంబంధాలున్నాయని.. ఎలాంటి సమాచారాన్ని అందజేశాడు.. ప్రతిఫలంగా ఏం తీసుకున్నాడు.. అనే కోణంలో ఎన్ఐఏ విచారణ జరుపుతున్నది.