గౌహతి: అస్సాంలోని కాజిరంగా జాతీయ పార్కు పరిసరాల్లో లగ్జరీ హోటళ్లు నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణాలను ప్రశ్నిస్తూ ఇవాళ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) సుమోటో నోటీసులు జారీ చేసింది. మీడియా కథనాలను ఆధారంగా తీసుకుని, ఢిల్లీకి చెందిన ఎన్జీటీ.. పర్యావరణ చట్టం కింద కేసును రిజిస్టర్ చేసింది. ఈ కేసులో విచారణ తేదీని ట్రిబ్యునల్ త్వరలో ప్రకటించనున్నది. ఇటీవలే అస్సాం ప్రభుత్వం.. యునెస్కో ప్రపంచ వారసత్వ సైట్ వద్ద ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం టాటా గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్నది. 120 కోట్ల ఖరీదుతో హోటల్ నిర్మించేందుకు ఒప్పందం జరిగింది. అస్సాం టూరిజం శాఖ, ఏపీపీఎల్, ఇండియా హోటల్స్ కంపెనీ ఆ ఒప్పందంలో ఉన్నాయి. ఒప్పందం ప్రకారం.. కాజిరంగా పార్కులో ఓ రిసార్ట్‌ను, స్పాను ఓపెన్ చేయనున్నారు. మరో అంతర్జాతీయ హోటల్ చైయిన్ హయ్యత్ కూడా పార్క్ వద్ద ఫైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించనున్నది.