MVA | ముంబై నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర ఎన్నికలు సమీపించిన వేళ మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో ముసలం మొదలైంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ అభ్యర్థే సీఎం అవుతారని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ పేరొన్నారు. తనను ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఒకరు సంప్రదించి బీజేపీలో చేరమని ఆఫర్ చేశారని.. అయితే అందుకు నిరాకరించి తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని.. తన పార్టీ అభ్యర్థి సీఎం అవుతారని చెప్పినట్లు వెల్లడించారు.
అంతే గాక బీజేపీపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలతో కూటమిలో చీలిక వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల తర్వాత సీఎంను ప్రకటిస్తామని మహాయుతి కూటమి చెబుతుండగా.. ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎంవీఏలో చీలిక వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికల ప్రకటనకు ముందు చాలాసార్లు ఉద్ధవ్ ఠాక్రే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, కాంగ్రెస్ పార్టీ నిరాకరించి ఉద్ధవ్‌కు షాక్ ఇచ్చాయి.