న్యూఢిల్లీ: భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడా పెద్దగా కొవిడ్ కేసులు నమోదు కానప్పటికీ.. వచ్చే జనవరి నెల మధ్య కాలం నాటికి కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉన్నది. బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాయి. గతంలో కొవిడ్ విజృంభించిన తీరును బట్టి వచ్చే జనవరి మాసం మధ్యలో కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అంచనా వేసినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. జనవరిలో కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రానున్న 40 రోజులు చాలా కీలకమని తెలిపాయి.
కాగా, చైనా, జపాన్, దక్షిణకొరియా లాంటి దేశాల్లో కరోనా విజృంభిస్తుండటంతో దేశంలో అదే పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులో పెట్టేలా ఏర్పాట్లు చేశారు. ఇవాళ కూడా దుబాయ్ నుంచి తమిళనాడుకు వచ్చిన ఇద్దరిలో కరోనా మహమ్మారిని గుర్తించారు. చెన్నై ఎయిర్పోర్టులో వారి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు.
ఇవాళ్టి రెండు కేసులతో కలిపి డిసెంబర్ 24 నుంచి 26 మధ్య దేశంలో కరోనా బారినపడిన అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 39కి చేరింది. మొత్తం 498 విమానాల నుంచి 1780 మంది శాంపిల్స్ సేకరించారు. అందులో 39 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 188 మంది కొవిడ్ బారినపడ్డారు. దాంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,468కి చేరింది.