లక్నో: అత్తవారింట్లోని బాత్రూమ్లో నవ వధువు స్నానం చేస్తుండగా గీజర్ పేలింది. ఈ సంఘటనలో ఆమె మరణించింది. (Newlywed Woman Dies) దీంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భోజిపురాలోని పిపల్సనా చౌదరి గ్రామానికి చెందిన దీపక్ యాదవ్‌కు బులంద్‌షహర్‌లోని కాలే కా నాగ్లా గ్రామానికి చెందిన దామినీతో ఐదు రోజుల కిందట వివాహం జరిగింది. నవ వధువైన ఆమె అత్తవారింటికి వచ్చింది.
కాగా, నవంబర్ 27న అత్తవారింట్లోని బాత్రూమ్లో దామినీ స్నానం చేస్తుండగా గీజర్ పేలింది. విష వాయువుల వల్ల లోపల అచేతనంగా పడిపోయింది. భర్త దీపక్ యాదవ్, అత్తమామలు ఎంత పిలిచినా ఆమె బాత్రూమ్ నుంచి బయటకు రాలేదు.
మరోవైపు ఆందోళన చెందిన అత్తింటి వారు బాత్రూమ్ డోర్ పగులగొట్టారు. లోనికి వెళ్లి చూడగా గీజర్ పేలడాన్ని గమనించారు. అచేతనంగా నేలపై పడి ఉన్న దామినీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పెళ్లైన ఐదు రోజులకే మరణించిన నవ వధువు దామినీ మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆమె మరణానికి కారణాలు తెలుస్తాయని పోలీస్ అధికారి తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.