లక్నో: ఉత్తరప్రదేశ్లోని బాండాలో వరకట్న వేధింపులకు నవ వధువు (Newlywed) బలైంది. అత్తింటి వారి డిమాండ్లను తీర్చకపోవడంతో వివాహమైన ఎనిమిది నెలలకే ఓ మహిళ ఉరివేసుకున్న స్థితిలో చనిపోయింది. అయితే కట్నం కోసమే ఆమెను చంపి, ఉరివేశారని మృతిరాలి తండ్రి ఆరోపించారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎనిమిది నెలల క్రితమే తన కుమార్తెకు వివాహం చేశానని, అత్తింటి వారి డిమాండ్లు తీర్చేందుకు తాను అప్పులు కూడా చేశానని మృతురాలి తండ్రి వెళ్లడించారు. అయినప్పటికీ తన కూతురుపై వేధింపులు ఆగలేదని, చంపేశారన్నారు. ముందే చంపి, ఆమెకు ఉరి వేశారని ఆరోపించారు. తాను ఇంటికి వెళ్లి చూసినప్పుడు ఆమె కాళ్లు నేలకు ఆనే ఉన్నాయని చెప్పారు. ఆయన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాండా ఏఎస్పీ మావిస్ తెలిపారు. కాగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.