Uttar Pradesh | పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్యం అందించేందుకు వైద్యులు నిరాకరించారు. ఆస్పత్రిలోని టాయిలెట్‌కు వెళ్లిన ఆమె.. అక్కడే శిశువుకు జన్మనిచ్చింది. అయితే శిశువు టాయిలెట్లో పడి చనిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్రలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సోనభద్ర జిల్లాకు చెందిన రష్మీకి నెలలు నిండడంతో.. ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు సోనభద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. కుటుంబ సభ్యులు ఎంత ప్రాధేయపడినప్పటికీ డాక్టర్లు వినిపించుకోలేదు. పురిటి నొప్పులు భరించలేక బాధితురాలు అక్కడున్న టాయిలెట్లోకి వెళ్లింది. అక్కడే శిశువును ప్రసవించింది. కాసేపటికే శిశువు ప్రాణాలు కోల్పోయాడు.
ప్రాణాలు కోల్పోయిన శిశువును చూసి కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పందించారు. శిశువుకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతికి గల కారణాలను తేల్చుతామన్నారు. శిశువు టాయిలెట్లో పడి చనిపోయాడా? లేక తల్లి కడుపులోనే మరణించాడా? అన్న విషయం తేలాల్సిన అవసరం ఉందన్నారు. టాయిలెట్లో పడి శిశువు చనిపోయినట్లు తేలితే.. ఆ సమయంలో డ్యూటీలో వైద్యులు, ఇతర సిబ్బందిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పష్టం చేశారు.