న్యూఢిల్లీ, నవంబర్ 3: న్యూజిలాండ్ అంధకారంలోకి వెళ్లాలనుకుంటున్నది. డార్క్ స్కై నేషన్‌గా మారాలనుకుంటున్నది. అదేమిటి అందరూ వెలుతురు కోరుకుంటారు.. కానీ చీకటిని కోరుకుంటున్నదేమిటి? అనుకుంటున్నారా? ఈ చీకటి జంతుజాలానికి మేలు చేసే చీకటి. వాటి జీవితాల్లో వెలుగులు నింపే చీకటి. రాత్రి చీకట్లు నిశాచర జీవులకు, వలస పక్షులకు చాలా అవసరం. కానీ మనం రాత్రులను పగళ్లుగా చేస్తున్నాం. కృత్రిమ విద్యుద్దీపాల కాంతులతో చీకట్లను చెదరగొడుతున్నాం. తద్వారా కీటకాలు, రాత్రి తిరిగే జంతువుల జీవితాలను మనకు తెలియకుండానే అతలాకుతలం చేస్తున్నాం. రాత్రిపూట సంచరించే పక్షులు గూళ్లు కట్టడం, గుడ్లుపెట్టి పిల్లల్ని కనడం వంటివి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఖగోళవేత్తల, సాధారణ ప్రజల ఆకాశవీక్షణంపైనా ప్రభావం పడుతున్నది. పర్యావరణ హితం కోసం అన్ని దేశాలూ రాత్రి కాంతులను తగ్గించాలని, జీవజాలానికి ఇంతి వెసులుబాటు కల్పించాలనే ఉద్యమం మెల్లమెల్లగా ఊపందుకుంటున్నది. అందులో అసాధారణమైన రీతిలో అగ్రస్థాయిలో నిలవాలని న్యూజిలాండ్ కోరుకొంటున్నది.
ప్రస్తుతం ఆ దేశం ఒక్కటే..
ప్రపంచంలో ప్రస్తుతం నియూ అనే చిన్న దేశం ఒక్కటే డార్క్ స్కై కంట్రీగా గుర్తింపు పొందింది. పసిఫిక్‌లోని చిన్న ద్వీపదేశమైన నియూ జనాభా కేవలం 1600 మాత్రమే. 2020లో ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ (ఐడీఎస్ఏ) ఆ దేశానికి సర్టిఫికేషన్ మంజూరు చేసింది. ఇప్పుడు న్యూజిలాండ్ అదే బాటలో పయనించాలని తీర్మానించుకుంది. న్యూజిలాండ్‌లోని అనేక ప్రాంతాలు రాత్రిపూట కృత్రిమ కాంతిలో ధగధగ లాడుతుంటాయి. ఇప్పుడు ఆ కాంతిని తగ్గించి రాత్రి చీకట్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. న్యూజిలాండ్‌లోని ఆదివాసీ మావరీ తెగ ప్రజలు రాత్రి చీకట్ల ఉద్యమాన్ని ముందుకు నడిపించడం విశేషం. ప్రపంచంలో 80 శాతం భూభాగాలు విద్యుద్దీపాల కాంతిలో తడుస్తున్న రోజుల్లో న్యూజిలాండ్ ఎంచుకున్న లక్ష్యం కొంచెం అసాధ్యంగానే కనిపిస్తుంది. కానీ మావరీ ప్రజల దీక్షను గమనిస్తే అది సుసాధ్యమేనని అనిపిస్తుంది. రాత్రి చీకట్లను కాపాడటం పర్యావరణ, సాంస్కృతిక పరిరక్షణకు చాలా కీలకమని వారంటున్నారు.