న్యూఢిల్లీ, జనవరి 24 : బ్లడ్ క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేందుకు దేశంలో కొత్త చికిత్సకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) ఆమోదం తెలిపింది. బెంగళూరుకు చెందిన బయోటెక్ స్టార్టప్ అయిన ఇమునీల్ థెరప్యూటిక్స్ అనే సంస్థ కార్టెమీ అనే జీవ ఔషధాన్ని తయారు చేసింది. ఇది సీఏఆర్-టీ సెల్ థెరపీ. బీ-ఎన్హెచ్ఎల్ అనే బ్లడ్ క్యాన్సర్ బాధితుల చికిత్సకు దీనిని ఉపయోగిస్తారు. దేశంలో వినియోగానికి ఆమోదం పొందిన రెండో సీఏఆర్-టీ సెల్ థెరపీ ఇది.
సాధారణ రసాయన ఔషధానికి ఈ జీవ ఔషధం భిన్నమైనది. రోగ నిరోధక వ్యవస్థ దీర్ఘకాలం ఉండేలా కణాలతో రసాయన ఔషధాన్ని తయారుచేస్తారు. జీవ ఔషధం ఇందుకు భిన్నంగా ఉంటుంది. రోగి నుంచి టీ-సెల్స్‌ను తీసుకొని క్యాన్సర్ కణాలపై దాడి చేసేలా జన్యు ఇంజినీరింగ్ చేసి మళ్లీ రోగిలోకి పంపిస్తారు. ఈ చికిత్సకు రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఇమునీల్ థెరప్యూటిక్స్ సంస్థ తెలిపింది.