తిరువనంతపురం: శబరిమల(Sabarimala) అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో హాజరవుతున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అయితే రద్దీని తగ్గించేందుకు స్పాట్ బుకింగ్ టికెట్లను 5 వేలకు పరిమితి చేశారు. ప్రతి రోజూ 20 వేల స్పాట్ బుకింగ్ టికెట్లను జారీ చేసే స్థానంలో.. ఇప్పుడు ఆ సంఖ్యను తగ్గించారు. కోర్టు ఆదేశాల ప్రకారం స్పాట్ బుకింగ్‌ను 5 వేల మందికి పరిమితం చేశారు. అయినా పంబా, నీలక్కల్ వద్ద ఉన్న కౌంటర్ల సమీపంలో భారీ సంఖ్యలో భక్తులు బారులు తీశారు.
ప్రస్తుతం నీలక్కల్, వండిపెరియార్ సెంటర్ల వద్ద మాత్రమే స్పాట్ బుకింగ్ టికెట్లు ఇస్తున్నారు. పంబా, ఎరుమేలి, చెంగనూరు వద్ద ఉన్న కౌంటర్లను తాత్కాలికంగా మూసివేశారు. నవంబర్ 24వ తేదీ వరకు ఇవే ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. హైకోర్టు ధర్మాసనం జస్టిస్ ఏ రాజా విజయరాఘవన్, కేవీ జయకుమార్ ఇచ్చిన ఆదేశాలతో స్పాట్ బుకింగ్ పాసుల సంఖ్యను తగ్గించారు.