OPT | హైదరాబాద్, జనవరి 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): భారతీయుల ‘డాలర్ కలలు’ కల్లలు కాబోతున్నాయి. హెచ్-1బీ వీసాల ద్వారా యూఎస్‌లో ఉన్నతోద్యోగాలు చేయాలనుకొనే వారికి కొత్త అడ్డంకులు పెరుగనున్నాయి. విదేశీ విద్యార్థులు పని అనుభవం సంపాదించుకోవడానికి సాయపడే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను వెంటనే రద్దు చేయాలని అమెరికావ్యాప్తంగా డిమాండ్లు పెరిగిపోవడంతో స్టూడెంట్ వర్క్ పర్మిట్లకు ముగింపు పలికే యోచనలో ట్రంప్ కార్యవర్గం ఉన్నట్టు సమాచారం.
అమెరికాలో వృత్తిపరమైన అనుభవం కోసం విదేశీ విద్యార్థులు ఎఫ్-1 వీసాల ద్వారా ఓపీటీ ప్రోగ్రామ్‌లో చేరుతారు. ఈ ప్రోగ్రామ్‌లో చేరిన విదేశీ విద్యార్థులు వారు ఎంచుకొన్న కోర్సులను బట్టి డిగ్రీ పూర్తయ్యాక ఏడాది నుంచి మూడేండ్లపాటు ఉద్యోగాలు చేయొచ్చు. ఇదే సమయంలో హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసి మొత్తంగా తొమ్మిదేండ్లపాటు ఉన్నతోద్యోగాల్లో కొనసాగవచ్చు. అనంతరం గ్రీన్‌కార్డుకు కూడా ఐప్లె చేసుకొంటే అగ్రరాజ్యంలోనే శాశ్వతంగా ఉండిపోవచ్చు. ఇదే అమెరికాలోని మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) నేటివిస్టులకు మింగుడుపడటం లేదు.
ఓపీటీ ప్రోగ్రామ్ కారణంగా హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని, స్థానిక అమెరికన్ల ఉపాధి అవకాశాలకు ఓపీటీ ప్రోగ్రామ్ గండిపెడుతుందని మాగా నేతలు మండిపడుతున్నారు. ఓపీటీ ప్రోగ్రామ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓపీటీ పేరిట విశ్వవిద్యాలయాలు చదువుకు బదులు వర్క్ పర్మిట్లను విక్రయిస్తున్నాయని, దీంతో అమెరికన్ విద్యార్థులు నష్టపోతున్నారని అమెరికా టెక్ వర్కర్స్ గ్రూప్ కూడా ఆరోపిస్తుంది. అమెరికాను రక్షించాలంటే ట్రంప్ కార్యవర్గం ఓపీటీ ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నది. అమెరికావ్యాప్తంగా ఈ డిమాండ్లు పెరుగడంతో స్టూడెంట్ వర్క్ పర్మిట్లకు ముగింపు పలికే యోచనలో ట్రంప్ కార్యవర్గం ఉన్నట్టు సమాచారం.
అమెరికాలో ఉంటున్న మొత్తం భారతీయ విద్యార్థుల్లో 29 శాతం మంది ఓపీటీ ప్రోగ్రామ్ ఆధారంగానే అక్కడికి వెళ్లినట్టు ఇమిగ్రేషన్ నిపుణులు చెప్తున్నారు. ఓపీటీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకొంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా 30 శాతం మేర పెరుగుతున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ను రద్దు చేస్తే, ఏటా దాదాపు లక్ష మంది భారత విద్యార్థులకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023లో మొత్తం 3,86,000 హెచ్-1బీ వీసాలను అమెరికా ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో 72.3 శాతం వీసాలు భారతీయులకే దక్కాయి. ఓపీటీ ప్రోగ్రామ్ రద్దుతో ఈ వీసాలు దక్కే భారతీయుల సంఖ్య కూడా తగ్గొచ్చని నిపుణులు చెప్తున్నారు.