న్యూఢిల్లీ : ముద్రణ, ప్రసార, డిజిటల్ మీడియాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చేందుకు కొత్తగా మీడియా కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ కమిటీ ఒకటి కేంద్రానికి సిఫారసు చేసింది. మీడియా నియంత్రణను క్రమబద్ధీకరించడం, సాంకేతిక పురోగతి, మీడియా కలయికల ద్వారా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడం లక్ష్యంగా ఈ ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం దేశంలో డిజిటల్ వేదికలు, ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా భారీ సంఖ్యలో పుట్టుకొచ్చాయి. దీంతో వీటిని నియంత్రించడం సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం డిజిటల్ వేదికలు ఐటీ చట్టం, 2021 కింద ఉండగా ప్రింట్ మీడియాను ప్రెస్ కౌన్సిల్ నియంత్రిస్తున్నది. టీవీ చానళ్లు కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం నడుస్తున్నాయి. మీడియా కౌన్సిల్ వీటన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకొస్తుంది.