న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి పాక్ కేంద్ర బిందువుగా నిలుస్తున్నదని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ప్రధాని మోదీ లక్ష్యంగా భుట్టో వ్యక్తిగత దూషణకు దిగారు. ‘బిన్‌లాడెన్ చనిపోయాడు. కానీ గుజరాత్ కసాయి బతికే ఉన్నాడు. అతడే భారత ప్రధాని మోదీ’ అని వ్యాఖ్యానించారు. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు పాక్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడింది. బిన్ లాడెన్‌ను అమరుడిగా కీర్తించిన దేశం పాక్ అని, జకీర్ రెహ్మాన్ లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీం లాంటి ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్నదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ ధ్వజమెత్తారు. మరోవైపు భుట్టో వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. శనివారం దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.