Income Tax | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను (ఐటీ) విధానాన్ని మరింత కొత్తగా తీసుకొచ్చారు. రేట్లు, శ్లాబులను సవరిస్తూ గతంతో పోల్చితే ఓ శ్లాబును పెంచి మొత్తం ఏడింటిని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను శనివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మధ్యతరగతి వర్గాలకు, ముఖ్యంగా వేతన జీవులకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే పాత, కొత్త ఆదాయ పన్ను విధానాల్లో కొత్తదాన్ని ఎంచుకొనేవారికి రూ.12 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నా ఎలాంటి పన్నులు ఉండబోవని స్పష్టం చేశారు.
ఈ రూ.12 లక్షలపై వచ్చే పన్ను మినహాయింపు (రూ.60వేలు) సెక్షన్ 87ఏ కింద వర్తించే రిబేటు. ఇక స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలుగానే ఉండగా, మొత్తం రూ.12.75 లక్షలదాకా పన్నులు చెల్లించనక్కర్లేదని మంత్రి తేల్చిచెప్పారు. దేశ ప్రజల పొదుపు, పెట్టుబడులు, కొనుగోలు శక్తిని పెంపొందించడానికే ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. కానీ పాత ఆదాయ పన్నులో ఎలాంటి మార్పులు చేయలేదు. మినహాయింపులు, డిడక్షన్లు యథాతథంగానే ఉన్నాయి.
వార్షిక ఆదాయం రూ.12.75 లక్షలదాకా ఎలాంటి పన్నులు ఉండబోవన్న కేంద్రం.. ఆ పరిమితి దాటితే మాత్రం పన్నులు పడుతాయంటూ ఏడు శ్లాబుల విధానాన్ని పరిచయం చేసింది. ఉదాహరణకు రాము వార్షిక ఆదాయం రూ.12.80 లక్షలుగా ఉన్నది. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలు తీసేస్తే.. పన్ను సహిత ఆదాయం రూ.12.05 లక్షలుగా తేలింది. ఇందులో రూ.4 లక్షలదాకా పన్ను చెల్లించనక్కర్లేదు. మిగతా రూ.8.05 లక్షల్లో రూ.4 లక్షలకు 5 శాతం (రూ.20,000), ఆపై రూ.4.05 లక్షల్లో రూ.4 లక్షలకు 10 శాతం (రూ.40,000) చొప్పున పన్ను పడుతుంది. మిగతా రూ.5 వేలకు 15 శాతం (రూ.750) పన్ను వర్తిస్తుంది. దీంతో మారిన కొత్త పన్ను రేట్లు, శ్లాబుల ప్రకారం రాము రూ.60,750 చెల్లించాల్సి ఉంటుంది.
బడ్జెట్లో ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్), ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్) మినహాయింపు పరిమితులను పెంచారు. సీనియర్ సిటిజన్లకు వార్షిక వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితిని లక్షకు పెంచారు. మునుపు రూ.50వేలే. కాగా, ఇతరులకు ఈ మినహాయింపును రూ.40వేల నుంచి 50వేలకు పెంచారు.
అద్దె ఆదాయంపైనా టీడీఎస్ మినహాయింపులకున్న పరిమితిని ఏటా రూ.6 లక్షలకు పెంచారు. మునుపు రూ.2.4 లక్షలే. దీంతో టీడీఎస్ వర్తించే లావాదేవీల సంఖ్య తగ్గుతుందని, చిన్న ట్యాక్స్‌పేయర్లకు ప్రయోజనమని మంత్రి తెలిపారు.
ఉదాహరణకు ఏబీసీ లిమిటెడ్ ఓ గిడ్డంగిని అద్దెకు తీసుకున్నది. నెలకు రూ.55వేలు అద్దె. ఏడాదికి రూ.6.6 లక్షలు అవుతున్నది. ఇది రూ.6 లక్షల పరిమితిని దాటిపోతున్నది. దాంతో ఏబీసీ లిమిటెడ్ నెలవారీ అద్దెలో 10 శాతం టీడీఎస్ రూ.5,500 మినహాయించుకొని, గిడ్డంగి యజమానికి రూ.49,500 ఇవ్వాలి. ఆ రూ.5,500 ప్రభుత్వానికి డిపాజిట్ చేస్తుంది. ఇదే టీడీఎస్.
ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ మినహాయింపునూ ఈ బడ్జెట్లో పెంచారు. ఆర్బీఐ ఎల్ఆర్ఎస్ కింద ప్రస్తుతమున్న రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అలాగే విద్య కోసం వచ్చే రెమిటెన్సెస్పై టీసీఎస్‌ను తొలగిస్తున్నట్టు ఈ మంత్రి సీతారామన్ చెప్పారు. కాగా, వచ్చేవారం పార్లమెంటులో కొత్త ఆదాయ పన్ను బిల్లును తేనున్నారు.
వ్యాపారులు వస్తూత్పత్తులు, సేవల అమ్మకానికిగాను కొనుగోలుదారుల వద్ద వసూలు చేస్తారు. ఉదాహరణకు ప్రకాశ్ ఓ వస్తువును రూ.50వేలకు కొన్నారు. దానిపై 5 శాతం టీసీఎస్ (రూ.2,500) వర్తిస్తే, రూ.52,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూ.2,500లను వ్యాపారి ప్రభుత్వానికి డిపాజిట్ చేస్తారు. నిబంధనలకు లోబడి ఐటీఆర్‌లలో ట్యాక్స్‌పేయర్లు ఈ మొత్తాలను క్లెయిం చేసుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది.
ప్రస్తుతం ఆదాయ పన్ను చెల్లింపుదారులకు పాత, కొత్త పన్ను విధానాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఐదేండ్ల కిందట కొత్త పన్ను విధానాన్ని పరిచయం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏటా దాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తూ రకరకాల ప్రోత్సాహకాలు, మినహాయింపుల్ని ఇస్తున్నది. తాజాగా కూడా పలు మార్పుల్ని చేసింది. కానీ పాత పన్ను విధానాన్ని మాత్రం పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. ఈసారి బడ్జెట్లోనూ అదే జరిగింది.
ఫలితంగా పాత పన్ను విధానానికి స్వస్తి పలుకనున్నారన్న అంచనాలు బలపడుతున్నాయి. నిజానికి ఆయా సెక్షన్ల కింద వివిధ రకాల పెట్టుబడులు, పొదుపు, ఖర్చులపై ట్యాక్స్‌పేయర్స్ పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపుల్ని క్లెయిం చేసుకోవచ్చు. కానీ కొత్త పన్ను విధానంలో ఇవేవీ ఉండవు. వార్షిక ఆదాయం నిర్ణీత పరిమితి దాటిందంటే ఏ మినహాయింపులకు తావు లేకుండా అందరికీ ఆయా శ్లాబుల ప్రకారం పన్నులు వర్తిస్తాయి. అయితే పాత పన్ను విధానాన్ని తొలగిస్తే మదుపు, పొదుపులకు పెద్దగా ఎవరూ ఆసక్తి కనబర్చకపోవచ్చన్న వాదనలు వస్తుండటం గమనార్హం. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులకు నష్టమేనంటున్నారు.
వార్షిక ఆదాయం రూ.12.75 లక్షలు దాటితే ఈ శ్లాబుల ప్రకారం పన్నులు వర్తిస్తాయి