న్యూఢిల్లీ : సవరించిన జీఎస్టీ శ్లాబ్‌ల ధరలు దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమలులోకి వస్తున్నాయి. ఇక నుంచి 5, 18 శాతం క్యాటగిరీలే ఉంటాయి. అయితే కొన్ని లగ్జరీ, సిన్ (హానికర) గూడ్స్‌ను 40 శాతం శ్లాబ్ పరిధిలోకి తెస్తారు. చాలా వరకు నిత్యావరసర వస్తువులను 5 శాతం పరిధిలోకి, ఇతర వస్తువులు, సేవలను 18 శాతం పరిధిలోకి చేర్చారు. పొగాకు, ఆల్కహాల్, బెట్టింగ్, ఆన్లైన్గేమింగ్ వంటి సిన్ గూడ్స్‌ను 40 శాతం పరిధిలోకి తెచ్చారు.
దేశంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధిని వేగవంతం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నొక్కి చెప్పారు. ఇది ఆత్మ నిర్భర్ భారత్ కోసం ఒక పెద్ద, అతిముఖ్యమైన అడుగు అని, స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహాన్నిచ్చి దేశ శ్రేయస్సుకు అనుసంధానిస్తుందని ఉద్ఘాటించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన సవరించిన జీఎస్టీ రేట్ల అమలును గుర్తు చేశారు. విదేశీ మూలాల వస్తువులు తెలియకుండానే ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయని, ఈ క్రమంలో స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని ఆయన కోరారు.