న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ ఎస్కే మిశ్రా కోసం ‘చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా’ (సీఐవో) అనే పదవిని మోదీ సర్కార్ సృష్టించబోతున్నది. దీనిపై కేంద్రం పెద్ద ఎత్తున మల్లగుల్లాలు పడుతున్నదని సమాచారం. సెప్టెంబర్ 15న ఈడీ చీఫ్ పదవి నుంచి ఎస్కే మిశ్రా తప్పుకోనున్నారు. ఈనేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని పెంచేందుకు మోదీ సర్కార్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కలుగజేసుకొని కేంద్రానికి మొట్టికాయలు వేసింది.
దీంతో ఇక ఈడీ చీఫ్‌గా ఆయన్ని కొనసాగించలేని పరిస్థితి నెలకొన్నది. అంతకన్నా శక్తివంతమైన పోస్ట్‌ను (సీఐవో)ను ఏర్పాటుచేసి.. దాని బాధ్యతులు ఎస్కే మిశ్రాకు అప్పగించబోతున్నట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో తాజాగా వార్తా కథనం వెలువడింది. సీబీఐ, ఈడీ చీఫ్‌లు సైతం తమ నివేదికలను సీఐవో అయిన ఎస్కే మిశ్రాకు అందజేయాల్సి వుంటుందని, ఆ నివేదికలను సీఐవో చీఫ్‌గా మిశ్రా నేరుగా ప్రధానికి అందజేస్తారని వార్తా కథనం పేర్కొన్నది.