Lt.Gov. vs AAP | మరోసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ – ఆప్ నేతల మధ్య రగడ మొదలైంది. ఇప్పటివరకు ఎన్నో విషయాల్లో ఆప్‌ను ఇబ్బంది పెట్టిన ఎల్జీ.. తాజాగా బీజేపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఎల్జీకి రెండు పేజీల లేఖను సంధించారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పైచేయి సాధించేందుకు వారికి అనుకూలంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి 10 మంది సభ్యులను నామినేట్ చేసిన తర్వాత రేపు మేయర పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు. మేయర్ ఎన్నికకు అధ్యక్షత వహించేందుకు ప్రోటెం స్పీకర్‌గా బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మను ఎల్జీ వీకే సక్సేనా నియమించారు. ఈ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు ఎల్జీకి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రెండు పేజీల లేఖ రాసి తన నిరసనను వ్యక్తపరిచారు.
ఢిల్లీ మేయర్ ఎన్నిక సమయంలో ఎల్జీ నిర్ణయం తీవ్ర నిరాశతో పాటు దిగ్భ్రాంతిని కలిగించిందని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో తన ప్రభుత్వాన్ని దాటవేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. ఎల్జీ తీసుకున్న నిర్ణయం నిస్సందేహంగా రాజ్యాంగ విరుద్ధమైనదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వం పనులకు ఆటంకం కలిగించేందుకు, పాలనలో జోక్యం చేసుకోవడానికి ఉన్న ఏ దారిని కూడా వదిలిపెట్టడం లేదని ఆక్షేపించారు. మేయర్ ఎన్నికను ప్రభావితం చేయడానికి ఎల్జీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, బీజేపీ అనుకూల సభ్యులను ఎంపికచేయడం ఉద్దేశపూర్వకమే అని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు రాసిన లేఖను కేజ్రీవాల్ ట్విట్టర్లో షేర్ చేశారు.