New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటనలు జరిగాయి. కదిలే బస్సులో యువతిపై నిర్భయ తరహా అత్యాచార ఘటన జరిగింది. మరో ఘటనలో ఒక స్కూల్లో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వివరాలివి.
మూడేళ్ల చిన్నారిపై స్కూల్ బస్సు డ్రైవర్..
ఢిల్లీలోని బవానా ప్రాంతంలోని ఒక ప్రైవేటు స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది బస్సు స్కూల్ డ్రైవర్. మూడేళ్ల నర్సరీ విద్యార్థిని మర్మావయవాలపై గాయాలుండటాన్ని ఆగష్టు 19న చిన్నారి తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో ఆ గాయాలు ఎలా అయ్యాయని చిన్నారిని తల్లిదండ్రులు అడిగారు. స్కూల్లో ఒక బ్యాడ్ అంకుల్ తనకు రోజూ చాక్లెట్లు ఇచ్చి, ఇబ్బంది పెడుతున్నాడని చెప్పింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులకు జరిగిన విషయం అర్థమైంది.
వెంటనే వారు పోలీసులకు, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ పాపకు ఇంకా మాటలు కూడా సరిగ్గా రావు. ఆ చాక్లెట్లు ఇచ్చిన అంకుల్ ఎవరో చిన్నారి గుర్తించలేదు. అతడి గురించి స్పష్టమైన వివరాలు చెప్పలేకపోయింది. అయితే, స్కూల్లో పని చేసే సిబ్బందికి సంబంధించి సీసీటీవీ వీడియో దృశ్యాలు, ఫొటోగ్రాఫ్‌లు చూపించారు. వాటిలో నిందితుడిని ఆ చిన్నారి గుర్తించింది. నిందితుడిని బస్సు డ్రైవర్ వికాస్‌గా గుర్తించారు. చిన్నారి వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో పాప వెంటే వెళ్లేవాడు. చాక్లెట్ల ఆశచూపి, అక్కడి మెట్లకిందికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
గతంలో నాలుగుసార్లు అలా చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు తేలింది. గతంలో కూడా పలువురు చిన్నారులకు నిందితుడు చాక్లెట్లు ఇవ్వడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో ఆ ఘటనలపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పాప ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. స్కూల్ ఆవరణలోనే వికాస్‌ను అరెస్టు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కదిలే బస్సులో 16 ఏళ్ల యువతిపై
మరో ఘటనలో.. కదిలే బస్సులో 16 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఢిల్లీలోని కాశ్మీరే గేట్ ఏరియాలోని ఖాళీగా ఉన్న ఒక స్లీపర్ బస్సులో ఈ ఘటన ఆగష్టు 4న జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లోని మణిపురి జిల్లాకు చెందిన 16 ఏళ్ల యువతి ఇంటి నుంచి చెప్పకుండా బయటకు వచ్చేసింది. తన ఊరు నుంచి నోయిడాలోని తన బంధువు దగ్గరికి వెళ్లాలనుకుంది. ఈ క్రమంలో ఒక బస్సు ఎక్కింది. అయితే, వర్షం, చీకటి కారణంగా మధ్యలోనే పారి చౌక్ ప్రాంతంలో పొరపాటున దిగేసింది. ఇదే సమయంలో అటు నుంచి ఒక స్లీపర్ బస్సు వెళ్తూ కనిపించింది.
దీంతో ఆ బస్సును ఆపాల్సిందిగా యువతి సిగ్నల్ ఇచ్చింది. యువతి ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న బస్సు, డ్రైవర్.. తాము కూడా నోయిడాలోని సెక్టార్ 63కే వెళ్తున్నామని చెప్పారు. ఆమెను కావాల్సిన చోట దింపుతామని చెప్పి బస్సులో ఎక్కించుకున్నారు. యువతి బస్సు ఎక్కిన తర్వాత ఆమెపై బస్సు కండక్టర్, తర్వాత డ్రైవర్.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అత్యాచారం అనంతరం యువతిని కాశ్మీర్ గేట్ సమీపంలో దింపేసి వెళ్లిపోయారు. అనంతరం బాధిత యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌ను అరెస్టు చేశారు. బస్సును సీజ్ చేశారు.