CISF-BSF | సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) డైరెక్టర్ జనరల్‌గా రజ్విందర్ సింగ్ భట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. భట్టి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు డైరెక్టర్ జనరల్‌గా కొనసాగనున్నారు. అదే సమయంలో సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్‌గా దలీప్ సింగ్ చౌదరి నియామకమయ్యారు. ఆయన 1990 ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఎస్ఎస్బీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన నవంబర్ 30, 2025 వరకు పదవిలో ఉంటారు. అలాగే, ప్రముఖ పెట్రోలియం సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లకు తాత్కాలిక చైర్మన్లను బుధవారం నియమించింది.
పూర్తిస్థాయి అధిపతులను నియమించే వరకు ఇద్దరూ తాత్కాలిక చైర్మన్లుగా కొనసాగనున్నారు. ఐఓసీ డైరెక్టర్ (మార్కెటింగ్) సతీశ్ కుమార్ వడుగురిని తాత్కాలిక చైర్మన్‌గా నియమించినట్లు పెట్రోలియం మంత్రిత్వశాఖ తెలిపింది. ఆయన సెప్టెంబర్ ఒకటి నుంచి మూడునెలల పాటు చైర్మన్‌గా కొనసాగనున్నారు. పదవీకాలాన్ని పర్తి చేసుకున్న శ్రీకాంత్ మాధవ్ వైద్య స్థానంలో ఆయనను పెట్రోలియంశాఖ నియమించింది. ఇక హెచ్‌పీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) రజనీష్ నారంగ్‌ను మూడునెలల కాలానికి చైర్మన్ అండ్ ఎండీగా నియమించింది. ఆయన పదవీకాలం సెప్టెంబర్ ఒకటి నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం ఉన్న సీఎండీ కుమార్ జోషి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు.