హైదరాబాద్: 2018 తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 17 ఎయిమ్స్(AIIMS) వైద్యశాలలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆ వైద్యకళాశాలలు నడుస్తున్నాయి. ఎంబీబీఎస్, పీజీ కోర్సులతో ప్రారంభమైన ఆ కాలేజీలకు ఇప్పటి వరకు ఈసీఎఫ్ఎంజీ(ఎడ్యుకేషన్ కమీషన్ ఫర్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్) అనుమతులు రాలేదు. వైద్య విద్యలో అండర్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు.. విదేశాల్లో పీజీ చేయాలన్నా లేక ఉన్నత విద్యను అభ్యసించాలన్నా.. ఈసీఎఫ్ఎంజీ(ECFMG) అక్రెడిటేషన్ అత్యంత కీలకమైంది. ఆయా దేశాల్లో పీజీ ట్రైనింగ్ కోసం జరిగే అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే లైసెన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. వైద్య కళాశాలలు ఇచ్చే ఎంబీబీఎస్ డిగ్రీలకు ఈసీఎఫ్ఎంజీ అక్రెడిటేషన్ ఉంటేనే విదేశాల్లో పీజీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రారంభమైన ఎయిమ్స్ కాలేజీలకు ఈసీఎఫ్ఎంజీ అనుమతులు ఇవ్వాలని విద్యార్థుల తల్లితండ్రలు డిమాండ్ చేస్తున్నారు.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ కింద ఉన్న 706 మెడికల్ కాలేజీలకు ఈసీఎఫ్ఎంజీ అక్రెడిటేషన్ దక్కింది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ కొత్తగా ప్రారంభమైన ఎయిమ్స్ కాలేజీలు ఎన్ఎంసీ పరిధిలోకి రాకపోవడం వల్ల.. ఆ కాలేజీలకు ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషన్ ఇంకా దక్కలేదు. దీంతో ఆ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు.. విదేశాల్లో పీజీ విద్యను అభ్యసించేందుకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. యూఎస్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్, యూకే ప్రొఫెషనల్ అండ్ లింగ్విస్టిక్ అసెస్మెంట్స్ బోర్డు, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్లో పరీక్షలు రాయాలంటే ఈసీఎఫ్ఎంజీ అక్రెడిటేషన్ ఉండాల్సిందే. కానీ ఇప్పటి వరకు కొత్త ఎయిమ్స్‌కు ఆ అనుమతి లేకపోవడంతో.. విదేశాల్లో పీజీ విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
2018 కన్నా ముందు ఏర్పడిన ఎయిమ్స్ కాలేజీలకు ఈసీఎఫ్ఎంజీ అనుమతులు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన ఎయిమ్స్ కాలేజీలకు ఈసీఎఫ్ఎంజీ అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల పేరెంట్స్ కేంద్ర ఆరోగ్యశాఖను కోరుతున్నారు. విదేశీ పోటీపరీక్షల గడువు ముగియకముందే ఈ చర్యను పూర్తి చేయాలని వేడుకున్నారు.