Ashok Chavan | తాను ఏనాడూ ప్రధాని నరేంద్రమోదీని వ్యక్తిగతంగా విమర్శించలేదని, బీజేపీ ఎంపీ అశోక్ చవాన్ చెప్పారు. మంగళవారం చత్రపతి శంభాజీ నగర్లో జరిగిన సభలో అశోక్ చవాన్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని త్యజించి అశోక్ చవాన్.. గత నెలలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తొలిసారి అశోక్ చవాన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు, బీజేపీలో చేర్చుకున్నందుకు అశోక్ చవాన్ ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీలో చేరిన 24 గంటల్లోపే తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం తనపై పార్టీకి ఉన్న విశ్వాసానికి నిదర్శనం అని అశోక్ చవాన్ అన్నారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 ప్లస్ సీట్లు సాధించాలన్న మోదీ నినాదాన్ని తన వంతు నిజం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తానేనాడూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని వ్యక్తిగతంగా విమర్శించలేదని చెప్పారు. మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. ఇదే సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజ ముండే మాట్లాడుతూ బీజేపీలో అశోక్ చవాన్ చేరికతో లోక్‌సభ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టేందుకు వీలు చిక్కిందన్నారు.