Ceasefire |ఢిల్లీ, మే 11: పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంపై మోదీ సర్కారుపై సోషల్‌మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అమెరికా ఒత్తిడికి బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భారత ఇమేజ్ను దెబ్బతీశారంటూ మండిపడ్డారు. యుద్ధంలో మొదటి నుంచీ పైచెయ్యి మనదే అయినప్పటికీ, కాల్పుల విరమణకు అంగీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కాల్పుల విరమణకు ఇది సరైన సమయం కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం తీసుకునేలా ఎవరు ప్రేరేపించారని, అమెరికా మధ్యవర్తిత్వానికి ఒప్పుకొని, దాని ముందు మోకరిల్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం విదితమే. ఈ మేరకు శనివారం ట్రంప్ సోషల్ మీడియాలో వెల్లడించిన తర్వాత భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్టు తెలిపారు. ఆ మరుక్షణమే ఈ విషయం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
వాళ్లు బాంబులు వేస్తుంటే.. శాంతి వచనాలా?
మోదీ సర్కారు చర్యపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దశాబ్దాలుగా పాక్ మనపై బాంబులు, మారణహోమాలు, యుద్ధాలు చేస్తున్న తర్వాత కూడా మనం వారికి మర్యాదపూర్వకంగా కాల్పుల విరమణను ప్రతిఫలంగా తిరిగి ఇచ్చాం. తెలివైన వ్యూహం. మీ శత్రువును గట్టిగా కౌగిలించుకోండి, తద్వారా వారు మిమ్మిల్ని ఇంకా బాగా చంపగలరు’ అని ఓ యూజర్ సెటైర్ వేశారు. భారత్ తన గ్లోబల్ ఇమేజ్ను దెబ్బతీసుకున్నదంటూ ఓ యూజర్ ఫైర్ అయ్యారు. ‘మొదటిసారి భారత్ ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనం పొందకుండానే కాల్పుల విరమణకు అంగీకరించింది. అది కూడా అమెరికా అధ్యక్షుడి ఒత్తిడి మూలంగా. ఇది దౌత్యపరమైన ఎదురుదెబ్బ మాత్రమే కాదు, గ్లోబల్ పవర్‌గా ఎదుగుతున్న భారత్ ఇమేజ్‌కు కూడా పెద్ద దెబ్బే’ అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు.
కాల్పుల విరమణ శాశ్వత శాంతికి తోడ్పడుతుందా?
ప్రధాని మోదీ ప్రజల నమ్మకం కోల్పోయారని ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించారు. ‘ప్రధాని మోదీ తన జీవితంలో అతి పెద్ద తప్పు చేశారు. ఆయన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఇకపై ఆయనకు ఓటు వేయను’ అని పేర్కొన్నారు. ‘ఈ కాల్పుల విరమణ శాశ్వత శాంతికి తోడ్పడుతుందా? పాక్ మళ్లీ చొరబాట్లను ప్రోత్సహించదని గ్యారెంటీ ఇవ్వగలరా? ఇకపై అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోరని మోదీ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందా? పహల్గాం ఘటన పునరావృతం కాకుండా నిరోధించగలరా? తమ ఆప్తులను కోల్పోయిన వారి గాయాలు ఎప్పటికైనా మానుతాయా? టూరిజం సురక్షితమేనా?.. వీటన్నింటికి సమాధానం అవును అయితే శాంతి అర్థవంతంగా ఉంటుంది’ అని ఓ నెటిజన్ ప్రశ్నల వర్షం కురిపించారు.