న్యూఢిల్లీ : నీట్-యూజీ రీ టెస్ట్‌లో జరిగిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎంబీబీఎస్ విద్యార్థులు నడుపుతున్న సాల్వర్ సిండికేట్ తాజాగా బయటపడింది. ఈ ముఠా ఎన్టీఏ చేసిన భద్రతా ఏర్పాట్లను ఛేదించింది. సాల్వర్ సిండికేట్ సూత్రధారి, ముజఫర్‌పూర్‌కు చెందిన అరిత్ యాదవ్ బీహార్‌లో నీట్-యూజీ రీ టెస్ట్ కోసం సుమారు 200 మంది నకిలీ అభ్యర్థులను కూర్చోపెట్టాలని ప్రణాళిక రూపొందించాడు. అసలు అభ్యర్థుల స్థానంలో సాల్వర్లతో(నిపుణులు) పరీక్ష రాయించేందుకు కొందరు అభ్యర్థులతో రూ.50 కోట్ల వరకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సగటున ఒక్కో అభ్యర్థి నుంచి రూ.40 లక్షలు వసూలు చేశాడు. స్థానిక పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థల నివేదికలలో ఈ షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
రాజస్థాన్‌లోని కోటాలో అర్పిత్ సాల్వర్ గ్యాంగ్‌ను తయారుచేశాడు. మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష కోసం కోచింగ్ తీసుకోవడానికి కోటాకు వెళ్లిన అర్పిత్ అక్కడ మయాంక్ కుమార్ అలియాస్ అశ్వినీ కుమార్, రంజిత్ కుమార్, రవిశంకర్‌తో స్నేహం చేశాడు. ఈ నలుగురూ ఒక ముఠాగా ఏర్పడి నకిలీ అభ్యర్థుల చేత పరీక్ష రాయించే పథకాన్ని రూపొందించారు. కోటాలో ఉన్న వివిధ కోచింగ్ సెంటర్లలో చదువుకుంటున్న విద్యార్థులను సాల్వర్లుగా మార్చింది. ఈ ముఠాతో చేతులు కలిపిన అసలు అభ్యర్థుల కోసం కూడా అన్వేషణ సాగుతున్నది. సాల్వర్ గ్యాంగ్ నెట్వర్క్ 8 రాష్ర్టాలలో విస్తరించి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ నెల 21న నిర్వహించిన నీట్-యూజీ ప్రాథమిక కీని ఎన్టీఏ అధికారులు గురువారం విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలుంటే ఈ నెల 25-28 వరకు తెలియజేయవచ్చన్నారు.