న్యూఢిల్లీ:నీట్-యూజీ 2025 క్వశ్చన్ పేపర్ తమ వద్ద ఉందని విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్న టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ చానళ్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఈ పరీక్షను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, ఎన్టీఏ ఇటీవల ప్రారంభించిన సస్పిషియస్ క్లెయిమ్స్ రిపోర్టింగ్ పోర్టల్‌కు 1,500కుపైగా క్లెయిమ్స్ వచ్చాయి.
ఈ నెల 4న జరిగే మెడికల్ ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటూ 106 టెలిగ్రామ్, 16 ఇన్స్టాగ్రామ్ చానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ చానళ్లపై చట్టపరమైన చర్యల కోసం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు ఈ వివరాలను ఎన్టీఏ పంపించింది.
ఈ సెంటర్ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తున్నది. ఈ చానళ్ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాపించకుండా, విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా నిరోధించేందుకు వాటిని తక్షణమే నిలిపేయాలని టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ మాధ్యమాలను ఎన్టీఏ కోరింది. నీట్-యూజీ పరీక్ష ఈ నెల 4న జరుగుతుంది.