న్యూఢిల్లీ, జూలై 6: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే నీట్-యూజీ 2024 ప్రవేశ పరీక్ష అక్రమాలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ యూజీ కౌన్సెలింగ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వాయిదా వేసింది. ఈ నెలాఖరులో కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశముందని ఎన్టీఏ అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. వాస్తవానికి ఈ కౌన్సెలింగ్ ఈ నెల 6 నుంచి మొదలుకావాల్సి ఉంది.
అయితే, ఈ ఏడాది కొన్ని మెడికల్ కాలేజీలకు అందజేయాల్సిన అనుమతి లేఖలకు సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని, అలాగే అదనంగా కొన్ని సీట్లు కూడా జోడించే అవకాశముందని సమాచారం. ‘కొత్త కాలేజీల్లోని సీట్లను తొలి రౌండ్ కౌన్సెలింగ్‌లోనే భర్తీ చేసే అంశంపై కసరత్తు నడుస్తున్నది. ఇది ఒక కొలిక్కి రాగానే కౌన్సెలింగ్ కొత్త తేదీలు ప్రకటిస్తాం’ అని ఎన్టీఏ అధికారి ఒకరు మీడియాకు వివరించారు.