NEET UG 2026 : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది వరకు అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. గత నెల 3న జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో రద్దైన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష జరిపే నిర్వహణా సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) దీన్ని రద్దు చేసింది. తిరిగి ఇవాళ మరోసారి పరీక్ష నిర్వహిస్తోంది.
గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్ష నిర్వహిస్తోంది. పోలీసులతోపాటు, సీఆర్పీఎఫ్ సహా వివిధ విభాగాలకు చెందిన భద్రతా బలగాల పహారా మధ్య పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. గతంలో మూడు గంటలు.. అంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే పరీక్ష జరిగేది. కానీ, ఈసారి అభ్యర్థుల సౌకర్యార్థం 15 నిమిషాలు అదనంగా సమయం కేటాయించారు. అలాగే, రఫ్ వర్క్ కోసం బుక్‌లెట్‌లో అదనపు పేజీల్ని కూడా కేటాయించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫార్ములా కోంస ఈ రఫ్ వర్క్ పేపర్స్ ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా 551 పట్టణాలు, నగరాల్లో 5,440 కేద్రాల్లో ఈ పరీక్ష జరుగుతోది. ఇందులో 14 విదేశీ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇంగ్లీష్‌తోపాటు 12 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. దాదాపు 95,000కుపైగా గదులను పరీక్ష కోసం కేటాయించారు.
అన్నింట్లోనూ సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి కాపీయింగ్‌కు అవకాశం లేకుండా దాదాపు 1,38,560 కెమెరాలు, 51,311 జామర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థుల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు అనుమతి ఉంది. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. పరీక్షలు జరిగే చోట అధికారులు ప్రత్యేక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశారు.