న్యూఢిల్లీ : ఈ నెల 15న జరగవలసిన నీట్-పీజీ, 2025ను వాయిదా వేసినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) సోమవారం ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీనిని ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షార్థులందరికీ ఒకేసారి పరీక్షను నిర్వహించవలసి ఉండటం వల్ల పరీక్షా కేంద్రాల పెంపు, మౌలిక సదుపాయాలను సమకూర్చడం వంటివి అవసరమవుతాయని పేర్కొంది.
సురక్షితమైన పరీక్షా కేంద్రాలను గుర్తించి, వాటిలో ఈ పరీక్షను పూర్తి పాదర్శకతతో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపింది. ఈ పరీక్ష నిర్వహణకు సవరించిన తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొంది. గతంలో ఈ పరీక్ష రెండు షిఫ్ట్‌లలో జరిగేది.