న్యూఢిల్లీ, మే 30 : జూన్ 15న నిర్వహించాల్సిన నీట్ పీజీ-2025 పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించరాదని, అలా చేస్తే విద్యార్థులకు సమాన అవకాశాలు ఉండవని సుప్రీం కోర్టు జాతీయ పరీక్షల మండలి(ఎన్బీఈ)ని ఆదేశించింది. రెండు షిఫ్టులలో పరీక్ష నిర్వహించడం అహేతుకం అవుతుందని, ఏ రెండు ప్రశ్న పత్రాల క్లిష్టత స్థాయి ఎన్నడూ ఒకే రకంగా ఉండదని జస్టిస్‌లు విక్రమ్ నాథ్, సంజయ్ కుమార్, ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని, సురక్షితమైన కేంద్రాలను చూడాలని ఆదేశించింది. ఎన్బీఈ తగిన పరీక్షా కేంద్రాలను కనుగొనలేకపోయినా, జూన్ 15న పరీక్ష నిర్వహించలేమనిభావించినా పరీక్ష తేదీని పొడిగించవచ్చునని ధర్మాసనం సూచించింది. కాగా, ఎన్బీఈ రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించడం వల్ల పరీక్ష కష్టస్థాయిలు సమానంగా ఉండవని, విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటూ అదితి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.