NEET PG | న్యూఢిల్లీ, ఆగస్టు 7: మరో ఐదు రోజుల్లో నీట్ పీజీ-2024 పరీక్ష జరగనున్న క్రమంలో ప్రశ్నాపత్రం లీకైందన్న ప్రచారం కలకలం రేపుతున్నది. దీనికి సంబంధించిన పోస్టులు ఎక్స్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై షేర్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. నీట్ పీజీ పేపర్ లీక్ గ్రూపు పేరుతో ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి జరిగిన బేరసారాల సంభాషణలను పలువురు యూజర్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న పరీక్ష రాయాల్సిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది. రెండు షిఫ్టుల లీకేజీ పేపర్ల కోసం ఈ గ్రూపులు రూ.70 వేల వరకు అడుగుతున్నట్టు ఆయా సందేశాల్లో ఉన్నది.
నీట్ పీజీ ప్రశ్నాపత్రాలు అమ్ముతామంటూ వందలాది టెలిగ్రామ్ చానెళ్లు పోస్టులు పెడుతున్నాయని, దీనిపై సైబర్ క్రైమ్, ఇంటెలిజెన్స్ విభాగం నిఘా పెట్టాలని డాక్టర్ ధ్రువ్ చౌహాన్ అనే ఎక్స్ యూజర్ పేర్కొన్నారు. ఈ పోస్టులు చూసిన పలువురు నెటిజన్లు.. పోటీ పరీక్షల పట్ల విశ్వాసం పోయిందని, లీకేజీ పేపర్లు ఉన్నాయంటూ ఇంత బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా వ్యాపారం చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. తనకు 678 మార్కులతో 433 ర్యాంకు వచ్చేలా చేసినందుకు పేపర్ లీక్ చేసిన వ్యక్తికి ధన్యవాదాలు చెబుతున్నట్టు అందులో ఉన్నది.
వాస్తవానికి ఈ ఏడాది జూన్లో నీజీ పీజీ-2024 పరీక్ష జరుగాల్సి ఉన్నది. అయితే నీట్ యూజీ లీకేజీ, యూజీసీ నెట్ ఉదంతాల నేపథ్యంలో పరీక్షను ఆగస్టు 11కు వాయిదా వేశారు.
నీట్ పీజీ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ జరుగుతున్న ప్రచారంపై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) స్పందించింది. అవన్నీ వదంతులేనని స్పష్టంచేసింది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం ఇంకా తయారు కాలేదని, లీక్ పేపర్ పేరిట జరుగుతున్న ప్రచారంపై అప్రమత్తంగా ఉం డాలని విద్యార్థులను కోరింది.