న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రెవేట్ విద్యా సంస్థలలో వైద్య విద్యలో పోస్ట్ గ్యాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే నీట్ పీజీ పరీక్షకు సంబంధించి మరో వివాదం తలెత్తింది. ఈ నెల 11న రెండు షిఫ్ట్‌లలో జరిగే ఈ పరీక్షకు కొందరు విద్యార్థులకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రాలను ఇవ్వడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) అధికారుల తీరు పట్ల పలువురు విద్యార్థులు సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నీట్ పీజీ పరీక్షను విద్యార్థుల సొంత రాష్ట్రంలోనే నిర్వహించాలని, అదీ ఒకే షిఫ్ట్‌లో జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేరళలోని పతనంతిట్టకు చెందిన ఒక విద్యార్థికి విశాఖపట్నం సెంటర్‌గా ఇచ్చారు. ఇది తనకెంతో దూర, వ్యయ భారమని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. అంత దూరం వెళ్లాలంటే రిజర్వేషన్లు ఉండవని, పైగా వర్షాలు, రైళ్ల ఆలస్యం వంటి కారణాల వల్ల పరీక్ష రాయలేకపోతే ఎన్బీఈ బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించారు. చాలా మంది ఇదే తరహా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలుగజేసుకుని తగు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వారు విజ్ఞప్తి చేశారు.