జైపూర్: నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పరీక్షకు సంబంధించిన 100 ప్రశ్నలు ముందుగానే రిలీజ్ కావడం వల్ల ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఇవాళ ఎన్టీఏ ప్రకటించింది. అయితే రాజస్థాన్‌లోని స్పెషల్ ఆపరేషన్ గ్రూపు పోలీసులు ఈ కేసులో కూపీ లాగారు. మే 3వ తేదీ పరీక్ష జరగడానికి ముందు కేరళలోని ఎంబీబీఎస్ విద్యార్థి ఒకరు గెస్ పేపర్‌ను రాజస్థాన్‌కు పంపినట్లు తేల్చారు. అయితే ఆ టెస్ట్ మెటీరియల్ లేదా గెస్ పేపర్లో ఉన్న ప్రశ్నలే నీట్ పరీక్షలో వచ్చినట్లు అనుమానిస్తున్నారు. రాజస్థాన్ ఎస్ఓజీ డీజీపీ ఆనంద్ కుమార్ శ్రీవాత్సవ దీని గురించి వివరణ ఇచ్చారు. గెస్ పేపర్ కేరళ నుంచి వచ్చినట్లు తేలిందన్నారు. కేరళలో మెడిసిన చదువుతున్న ఓ విద్యార్థి ఆ మెటీరియల్‌ను పంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. అయితే మెడికల్ విద్యార్థికి గెస్ పేపర్ ఎలా వచ్చిందన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నామన్నారు.
గెస్ పేపర్‌ను రిలీజ్ చేసిన విద్యార్థి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కానీ అతను రాజస్థాన్ రాష్ట్ర నివాసితుడు అని తెలిసింది. అయితే తాత్కాలికంగా డబ్బులు సంపాదించేందుకు ఆ గెస్ పేపర్‌ను తయారు చేశాడా లేదా అన్న కోణంలో విచారిస్తున్నారు. గెస్ పేపర్‌ను తయారు చేసి చీటింగ్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏడీజీపీ విశాల్ భన్సల్ తెలిపారు. మే 3వ తేదీ పరీక్ష కన్నా ముందు సుమారు 400 ప్రశ్నలు సర్క్యూలేట్ అయ్యాయి. ఇక బయోలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుకు చెందిన ప్రశ్నలు దాదాపు ఒకేలా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. దీన్ని క్రిమినల్ కోణంలో విచారిస్తున్న నేపథ్యంలో ఇంకా కేసును రిజిస్టర్ చేయలేదని భన్సల్ వెల్లడించారు. రాజస్థాన్‌లోని సికర్‌లో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌కు కేరళ నుంచి మెటీరియల్ పంపినట్లు విచారణలో తేలిందన్నారు. ఇక అక్కడ నుంచి వాట్సాప్ ద్వారా ఆ ప్రశ్నలు వైరల్ అయ్యాయన్నారు.
నీట్ పరీక్ష వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 20 మంది అనుమానితులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం దీన్ని ఇంకా ద్రువీకరించలేదు. డెహ్రాడున్, సికర్, జున్జున్ ప్రదేశాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫీల్డ్ లెవల్ ఎంక్వైరీలు, సోదాలు చేపడుతున్నారు. మే 3వ తేదీన జరిగిన పరీక్షకు సుమారు 22.7 లక్షల మంది హాజరయ్యారు. ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఇతర మెడికల్ అనుబంధ కోర్సు ప్రవేశం కోసం నీట్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షను నిర్వహిస్తోంది. దీనికి బాస్‌గా ప్రదీప్ కుమార్ జోషీ ఉన్నారు. 2024 నీట్ స్కామ్ జరిగినప్పుడు కూడా ఆయనే ఎన్టీఏ హెడ్‌గా ఉన్నారు. ఆ ఏడాది సుమారు 1500 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఆ సంవత్సరం బీహార్‌లో నీట్ పేపర్ లీకైన విషయం తెలిసిందే. నీట్ గెస్ పేపర్‌ను ఒక్కో స్టూడెంట్‌కు సుమారు 5 లక్షలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.