PM Modi : ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ (PM Narendra Modi) విమర్శించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. పశ్చిమబెంగాల్ (West Bengal) పర్యటనలో ప్రధాని మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే బీజేపీ ప్రభుత్వం (BJP govt) కొలువుదీరాల్సిన అవసరం ఉందన్నారు.
దేశ ప్రజలు ముఖ్యంగా జెన్-జీ కూడా బీజేపీ అభివృద్ధి నమూనాను విశ్వసిస్తున్నారని ప్రధాని చెప్పారు. మాల్దా సభలో ప్రసంగించిన ఆయన.. బీహార్‌లో ఎన్డీఏ విజయం సాధించిందని, ఇక బెంగాల్‌కు సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ సందర్భంగా బెంగాల్‌కు అసలైన సవాల్ చొరబాట్లేనని, వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
బెంగాల్‌కు అతిపెద్ద సవాల్ చొరబాట్లేనని, వీటి కారణంగానే మాల్దా, ముర్షీదాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయని ప్రధాని చెప్పారు. చొరబాట్ల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల జనాభా వర్గీకరణలోనూ మార్పు వచ్చిందని అన్నారు. వీటిని అరికట్టడానికి టీఎంసీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు. పైగా చొరబాటుదారులను ఓటర్లుగా మారుస్తోందని విమర్శించారు.
రాష్ట్రానికి వరద సహాయ నిధులను 40 సార్లు అందించామని, అయినా అవి అసలైన లబ్ధిదారులకు చేరలేదని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రవాటాగా దక్కే కేంద్ర నిధులను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొడుతోందని ఆరోపించారు. ఆ పార్టీ అవినీతి, హింస, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే పార్టీ అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.